Press "Enter" to skip to content

కనకాయ్

Last updated on September 22, 2021

May 31, 201

కనకాయ్:

మా తొలినాళ్ళ తెలంగాణా చరిత్ర యాత్రలో చూసిన విశేషమైన ప్రదేశం:

పూర్వకాలపు పౌరాణిక కణ్వమహర్షికి తన తపశ్శక్తితో లభించిన కూతుళ్ళు గిరిజాయి, బూతాయి, అరకాయి, కనకాయిలట. కనకాయి కణ్వమహర్షి చిన్నకూతురు. కనకాయి కనకాయ్ లోని కోటలో వుండి అడిగిన వాళ్ళకు బంగారం యిచ్చేదట. పిలిస్తే పలికెడిదట. ఎవరో అవమానకరంగా మాట్లాడినప్పటినుండి శిలగా మారిపోయిందని స్థానికులు చెప్పుకునే కైఫీయత్. ఈ ప్రదేశంలోని దుర్గ నిర్మాణం, దానికి వేసిన రాళ్ళు పరిచిన బాట చూసి, పూర్వమిది గోండుల కోట అని, కనకాయ్ రాజ్యమని, శత్రువుల దాడిలో ధ్వంసమైందని అనుకున్నాం. గిరిజనులు తమకై యుద్ధాలలో పోరాడి మరణించిన తమ నాయకులను, పాలకులను దేవుళ్ళుగా ఆరాధించడం వారి సంప్రదాయం. తమ ప్రియతమ రాణి కనకాయ్ నే దేవతగా పూజిస్తున్నారు. కనకాయ్ కి జాతర చేసినపుడు అక్కడే గుడికి ఎదురుగా వున్న సిరిమానును పూజించి జెండాకట్టడం, జాతరచేయడం గిరిజన సంప్రదాయమే. కనకాయ్ తో పాటు ముగురక్కల పేర్లమీద నాలుగు ఊర్లున్నాయి. ఇవి వారి రాజ్యాలే..

2013 అక్టోబర్ 16న నేను, వేముగంటి మురళీకృష్ణ, మురళి అన్న రఘునందన్, విధుమౌళి, బాలకిషన్, నాని కలిసి ఆదిలాబాద్ (ప్రస్తుతం నిర్మల్) జిల్లా ఇచ్చోడ దగ్గరి (పిప్రి ), బజార్ హత్నూర్ మండలంలో కనకాయ్ అనే పురాతన గోండ్ (అంధ్?) రాజ్యపు కోట చూడ్డానికి వెళ్ళాం. వర్థమానుకోట సర్పంచ్, పిప్రి సర్ఫంచ్, అక్కడి విలేకరులు, యువకులు మాకు దారి చూపుతు మా వెంట వొచ్చి అక్కడి విశేషాలన్ని చూపించారు, వివరించారు. 
కనకాయ్ దారిలో మొదటే నాలుగైదు ఆదిమానవుల సమాధులు ( రాతికుప్సలు, సిస్తులు, డోల్మన్లు టోపి రాళ్ళతో ) కనిపించాయి. అక్కడనుండి రాతిగోడల వంటి నిర్మాణాలు, ఆవాసాల శిథిలాలు దారిపొడుగున కనిపించాయి. కొంత దూరం పోయాక రాతిబాట (రోడ్డు ) కోటదాకా వుంది. ముందరొక కోటబురుజు శిథిలస్థితిలో వుంది. అటుపక్కన కడెం నది ప్రవాహం జలపాతాలై కనువిందుగా…. మధ్యలో పాతకుండ ముక్క దొరికింది. అక్కడో రోలు కనిపించింది. సానరాయి ముక్క, నూరే రాళ్ళు, పెద్దసైజు ఇటుకలు, ఇనుం చిట్టెం లభించాయి. కనకాయ్ కోటలోకి ప్రవేశించే ముందర కొలను (నీటిమడుగు) వుంది. కనకాయి గుడి (ఇటీవలే చినకప్పు ఏర్పరిచారు)లో కనకాయి (కనకదుర్గ అంటున్నారు )దేవతా విగ్రహం. అవతలి పక్క ఉత్తరంగా నాగదేవతగా చెప్పబడే బొమ్మలేని పలకరాయి వుంది. కనకాయి గుడిలో గద్దెలాగా పరచిన రాళ్లన్ని పాతగుడి కట్టడపురాళ్ళే. గుడిముందర తిరుమాను(సిరిమాను) చెట్టు, చెట్టుకు జాతరపుడు గిరిజనులు కట్టే జెండాలు కనిపించాయి. ఆ తర్వాత గొలుసుల-కుండి కొరకు తిరిగాము.

కనకాయ్ లో చూసిన కనకాయ్ దేవతా విగ్రహం చతుర్భుజి. వెనక కుడిచేతిలో త్రిశూలం, ముందు కుడిచేతిలో ఖడ్గం, వెనక ఎడమచేతిలో సర్పంతో ఢమరుకం, ముందు ఎడమచేతిలో రక్తపాత్ర. చిన్న కిరీటం. దుర్గారూపం. అయితే దేవత గోరక్షాసనంలో కూర్చుని వుంది. కనుక ఈ దేవత తాంత్రిక దేవతాశిల్పం అనవచ్చు. అక్కడ చూసిన దేవాలయ శిథిలాలలో దేవాలయ జగతిరాళ్ళు, కప్పుశిల, గోడల రాళ్ళు, కొన్ని విరిగిన స్తంభాలు అగుపిస్తున్నాయి. దేవతా పీఠం మీద నాలుగురేకుల పుష్పం లాంఛనంగా వుంది. దేవతావిగ్రహం కొత్తదన్నట్టు అనిపిస్తున్నది. 
          కనకాయ్ దేవాలయం ముందరి స్తంభానికి నాలుగువైపుల ఉల్బణ శిల్పాలు(Bas relief) ఉన్నాయి. వాటిలో మొదటివైపు ఒకవీరుడు యుద్ధంలో శత్రుసంహారం చేస్తున్నాడు. అతని ఎడమచేతిలో గదవంటి ఆయుధం, కుడిచేతిలో ఆయుధం కొంచెం అస్పష్టం. ఎడమకాలితో గుర్రాన్ని తన్నుతున్నట్టు, అతని కాళ్ళ నడుమ కూలిపోయిన శత్రువులు కనిపిస్తున్నారు. రెండవవైపు అశ్వారోహితుడైన యోధుడు తన ఎడమకాలితో తొక్కి వధిస్తున్నాడు. అతని కింది వరుసలో భటులు సాయుధులై, డాళ్ళతో కనిపిస్తున్నారు. మూడోవైపు శిల్పం పెద్దతలతో వున్న మనిషి పెద్దకొమ్ము కుడిచేత్తో , ఎడమ చేత్తో ఏనుగు వంటి జంతువునెత్తినట్లుగా, ఆ పైన మరేదో జంతువు బొమ్మలున్నాయి.. నాలుగోవైపు ఇద్దరు వీరులు ధనుర్బాణాలు ధరించి కనిపిస్తున్నారు. ఇన్ని శిల్పాలున్న ఈ స్తంభం ఏ చారిత్రక సందర్భానికి సాక్ష్యంగా నిలిచిందో తెలుసుకోవడం సాధ్యపడలేదు.

కనకాయ్ కోటకు వెళ్ళే దారిలోనే కనిపించిన పురామానవుల సమాధుల ప్రాంతంలో, కనకాయ్ గుడి నుంచి తిరిగివొచ్చే దారిలో కొన్ని పురామానవుల రాతిపనిముట్లు దొరికాయి. వాటిలో దోకుడు (చాపర్) రాయి, స్క్రూడ్రైవర్ వంటి పరికరం, మైక్రోలిథ్స్ వున్నాయి. ఠాకూర్ రాజారాం సింగ్ ఈ ప్రాంతంలో పాతరాతియుగం నుంచి మథ్యరాతియుగందాక రాతిపనిముట్లు విరివిగ దొరికినట్లు తన నోట్స్ లో రాసుకున్నాడు. 
ఈ పనిముట్లు ఈ ప్రాంతమంతా ఒకప్పుడు పురామానవుల ఆవాసాలుండేవని, వేలసంవత్సరాలుగా నివసించినట్లు వారి పనిముట్లు, ఇతర ఆధారాలతో చెప్పవచ్చు. చారిత్రక కాలానికి సంబంధించి ఈ కనకాయ్ గోండు రాజ్యంలోని ఒక కోట. అక్కడ లభించిన ఇటుకలు సాతవాహన కాలానికి చెందినవి. అందువల్ల ఇక్కడ సాతవాహనకాలం నుంచి రాజ్యమేదో వుండివుండాలని సందేహించవలసి వస్తున్నది.

మా సందేహం నిజం చేస్తూ 2008లోనే కనకాయ్ ని సందర్శించిన ప్రసిద్ధ చరిత్రకారులు వివికృష్ణశాస్త్రి, జితేంద్రబాబు, జైకిషన్, సూర్యకుమార్ లు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవితగారు…కనకాయ్ ఒకప్పుడు సాతవాహనకాలం నాటి కోట అని, అక్కడొక రోమన్ల శైలి ఆంఫీథియేటర్ వుండేదని, బౌద్ధజాతక కథల శిల్పాలతో స్తంభముందని, కనకాయ్ ని తర్వాత కాలంలో అక్కడికి చేర్చి కనకాయ్ గుడిగా మార్చారని…అక్కడ పురామానవుని రాతిపనిముట్లు, ఇనుం వస్తువులు దొరికాయని జైకిషన్ గారితో సంభాషణలో తెలిసింది.పూర్తి నివేదిక వారినుంచి పొందడానికి కోరడం జరిగింది. తెలంగాణ చరిత్రలో కనకాయ్ ది ప్రత్యేక అధ్యాయం అవడం నిజం.
ఈ ప్రదేశంలో మట్టి పూసలు, గాజుముక్కలు దొరికాయి. 2,3 కి.మీ.లు పొడవైన రాతిగుండ్లు పరిచిన బాట, దాని పక్కన వున్న పోస్ట్ హోల్స్( స్తంభాల గుంటలు) వుండడం ఒకప్పుడు అక్కడ దుకాణాల అంగళ్ళుండేవని సాక్ష్యాలు. అక్కడ దొరికిన కుండపెంకుల డేటింగ్ చేయిస్తే క్రీ.పూ. 700సం.లనాటివని తెలిసింది. బిబిసి వారు, విదేశీ పరిశోధకులు కనకాయ్ ని చూసి క్రీ.పూ. 1000సం.ల నుంచే ఇక్కడ తొలి చారిత్రక సంస్కృతి వుందని అన్నారని, సాతవాహనులకు పూర్వం నుంచే ఇక్కడ గొప్ప రాజ్యం వుండేదని తమకు దొరికిన ఆధారాలతో చెప్తున్నామని ప్రముఖ చరిత్రకారుడు జితేంద్రబాబు గారితో చేసిన సంభాషణలో వివరించారు. ఏ గ్రేట్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. వీ హావ్ టు డూ మోర్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *