Press "Enter" to skip to content

నైనపాక దేవాలయం:

Last updated on June 16, 2021


4 June 2020
  · Shared with Public

ఈ నైనపాక దేవాలయానికి సంబంధించిన క్షేత్రపరిశోధన, ఫోటోగ్రఫీ అంతా మా యువపరిశోధకుడు అరవింద్ ఆర్య చేసినదే. అరవింద్ కు అభినందనలు. ఇంత గొప్ప సమాచారాన్నందించినందుకు నా ధన్యవాదాలు నైనపాక దేవాలయం వరంగల్లుకు 60 కి.మీ.ల దూరంలో, జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో వుంటుంది. సాటిలేని నిర్మాణం. దక్షిణభారతదేశంలోనే ఏకైకదేవాలయం. శైలి అపూర్వం. తక్కువమందికి తెలిసిన సర్వతోభద్ర వాస్తునిర్మాణానికి ప్రాచీనశైలి. ఒకే రాతికి నలుదిశల దేవతలను చెక్కివున్న దేవాలయం. దేవాలయానికి నలువైపుల ద్వారాలున్నాయి. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో దేవుడు దర్శనమిచ్చే ఆలయం. అరుదైనది. దేవాలయంలో యోగ నారసింహుడు, కాళీయమర్దన వేణుగోపాలస్వామి, శ్రీరాముడు, బలరాముడు నలువైపుల దర్శనమిస్తుంటారు. దేవాలయం లేత ఎరుపురంగు రాతిబండ ఉపరితలంమీద నిర్మించబడ్డది. దేవాలయ నిర్మాణం సర్వతోభద్రదేవాలయ వాస్తుశైలి. దేవాలయ విమానం అలంకృతమైనది. 50 అడుగుల ఎత్తైన ఇటుకలతో కట్టబడిన శిఖరం. దేవాలయాన్ని 15,16 శతాబ్దాలలో కట్టినట్టు నమ్ముతున్నారు ప్రజలు. ఈ దేవాలయం గురించి పూర్వ ఆర్కియాలజీ, మ్యూజియంల శాఖకు చెందిన ఎన్. రామకృష్ణారావు, ఎస్సెస్. రంగాచారి 1994లో మొదటిసారి ఈ దేవాలయాన్ని గురించి నివేదిక రాసారు. 2012లో ఇంటాక్ ఈ ఆలయం పురావస్తు ప్రాధాన్యతను, కళాత్మక ప్రాముఖ్యతను గురించింది. ఏఎస్సై వారు ఈ ఆలయాన్ని సందర్శించారు. దక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ తరపున కాకతీయనిర్మాణాల మీద గైడ్ బుక్ రూపొందిస్తున్న పురావస్తు పరిశోధకుడు ప్రొ.ఫిలిప్ బి.వాగనర్ నిర్మాణపరంగా ఈ దేవాలయాన్ని15,16 శతాబ్దాలలో వైష్ణవులైన పద్మనాయకులు నిర్మించివుంటారని అభిప్రాయపడ్డాడు. స్థానికంగా ప్రజలు మహాభారతేతిహాసంలో కనిపించే పౌరాణిక పాత్ర, బకాసురుడు ఈ ప్రాంతాన్ని పాలించేవాడని చెప్పుకుంటారు. అంతకన్నా దేవాలయంలోని యోగానంద నరసింహస్వామిని సరిగా గుర్తించలేక తననే బకాసురుడనుకుని ఈ గుడినే బకాసురుని గుడిగా పిలుస్తుంటారు. ఈ దేవాలయంలో నలువైపుల ద్వారాల నుంచి నలుగురు దేవుళ్ళు కనిపిస్తారు. దేవాలయనిర్మాణంలో ఏకగర్భాలయం, నాలుగుద్వారాలతో గుడి కనిపించడం అరుదు. ప్రాసాదనిర్మాణంలో ఇటువంటి వాస్తుశైలిని సర్వతోభద్ర నిర్మాణశైలి అంటారు. విష్ణుధర్మోత్తర ఖండంలో చెప్పిన వంద రకాల గుడులలో సర్వతోభద్ర ఒకటి. నైనపాక దేవాలయం సర్వతోభద్ర దేవాలయం. ఈ గుడిలో ప్రధానదైవం నారసింహుడు. దక్షిణహస్త ప్రదక్షిణ మార్గంలో కాళింగ వేణుగోపాలస్వామి, వామహస్త ప్రదక్షిణ మార్గంలో లక్ష్మణ,రామ,సీతాదేవీల శిల్పం, నారసింహునికి వెనకవైపు సంకర్షణుడు(బలరాముడు)న్నాడు. ఈ విగ్రహశిల్పాలన్నీ 4అడుగులకు మించి కనిపిస్తాయి. అన్ని విగ్రహశిల్పాలమీద గోపుర శిల్పమున్నది. దానిమీద కీర్తిముఖం, తోరణాలు చెక్కివున్నాయి. గోపురం అర్థగోళాకారంలో కనిపిస్తున్నది. దేవాలయానికున్న 4 ద్వారాలకు ఇద్దరిద్దరు వైష్ణవాలయద్వారపాలకులు అగుపిస్తున్నారు. నరసింహమూర్తి యోగనారసింహుడనడానికి యోగబంధం(పట్టా) లేదు. అర్థపద్మాసనంలో కూర్చున్నాడు. చతుర్భుజుడు. ముందరి కుడి,ఎడమచేతులు రెండూ మడిచిన మోకాళ్ళమీద ఆనించాడు. ఎడమతొడమీద ద్విభుజియైన దేవత కుడిచేయి వరదహస్తముద్రలో ఆసీనురాలై వుంది. ఆ దేవత లక్ష్మీ దేవతే. స్వామికి దక్షిణహస్తంవైపు కాళింగమర్దన మీసాల వేణుగోపాలస్వామి. ఇద్దరు చామరధారిణులతో కనిపిస్తున్నాడు. కుడికాలు కాళింగుని శీర్షం మీద వుంది. ముందరి చేతులలో వేణువుంది. వెనక చేతులతో కాళింగుని నిలువరిస్తున్నాడు. వేణుగోపాలస్వామికి గరుడ వాహనం కనిపిస్తున్నది. నరసింహమూర్తికి వామహస్తదిశలో అంజలి ఘటించి నిలుచున్న ద్విభుజుడు లక్ష్మణుడు కుడివైపు, కుడిచేయి పైకెత్తి వింజామరతో నిలుచున్న సీతాదేవితో మధ్యలో మీసాల రాముడు కుడిచేత బాణం, ఎడమచేత విల్లు ధరించివున్నాడు. కుడి, ఎడమ భుజాలకు పైన చక్రం,శంఖువు వున్నాయి. పీఠంపై వున్నది హనుమంతుడా స్పష్టంగా లేదు. సిగముడి వుంది. నరసింహస్వామికి వెనకవైపున మీసాల బలరాముడు(సంకర్షణుడు) చతుర్బుజుడు, చామరగ్రాహిణి పరివారదేవత. ముందరి కుడిచేతిలో గద, ఎడమచేతిలో నాగలి, వెనక చేతులలో చక్రం,శంఖువు ధరించివున్నాడు. ఈ గుడిలోని నలుగురు దేవుళ్ళు చతుర్భుజులే. అందరు మీసాల దేవుళ్ళే. వెనక చేతులలో అందరికి చక్ర, శంఖాలున్నాయి. అందరి దేవుళ్ళ మెడనలంకరించిన కంఠహారాలు సమానమే. కరండ మకుటాలు సమానమే. ఆయుధాలన్నీ కటకముద్రలో ధరించివున్నారు. దేవుళ్ళకు మీసాలుండడం, చక్ర,శంఖువులు వెనక చేతుల్లో కటకముద్రలో ధరించడం, మనకు పాంచాలరాయుడు(శాయంపేట), వీరనారాయణుడు(కొలనుపాక)వంటి దేవతలతో సాధారణీకరించవచ్చు. ఈ శైలి శిల్పాలు కళ్యాణీ చాళుక్యులు, కాకతీయుల కాలంలో, విజయనగరకాలంలో కనిపిస్తాయి. కనుక నైనపాక దేవాలయంలో మూర్తులను వాగనార్ అన్నట్టు పద్మనాయకుల ఖాతాలో వేయడం సమంజసమనిపించదు. అట్లే దేవాలయం రెండు రకాల వస్తువులు రాళ్ళు, ఇటుకలతో కట్టబడ్డది. ప్రాచీన దేవాలయ నిర్మాణంలో ఇది కూడా ఒక లక్షణం. లేదా ముందే రాతితో నిర్మించిన దేవాలయం కప్పుమీద ఇటుకల విమానం నిర్మించి వుండాలి. ఇటుకలను పరిశీలించినపుడు ఇటుకలు విష్ణుకుండినుల కాలంనాటి(గొల్లత్తగుడికి వాడిన)ఇటుకలను పోలివున్నాయి. అంతేకాదు. ఇటుకల విమానానికి డంగుసున్నంపూసి చేసిన అలంకరణలు కూడా దేవాలయ నిర్మాణాన్ని వెనక్కి తీసుకుపోతున్నాయి. గూటి శిల్పాలను పరిశోధించాలి. గుడి విమానం 4 అంతస్తులతో కనిపిస్తున్నది. 5వ అంతస్తు కూలిపోయింది. ఏక గర్భాలయం, ఐదంతస్తుల విమానం సర్వతోభద్ర ప్రాసాదనిర్మాణంలో వున్నదే. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లా దేవఘర్ లో నిర్మించిన దశావతార దేవాలయానికి, నైనపాక సర్వతోభద్ర దేవాలయానికి పోలికలు, భేదాలున్నాయి. అక్కడ ఆ దేవాలయంలో సాత్వతమత సంప్రదాయానికి అనుగుణంగా చతుర్వ్యూహమూర్తుల్ని ప్రతిష్టిస్తే, ఇక్కడ దేవాలయంలో సాత్వతమూర్తులలోని వాసుదేవునికి బదులుగా నారసింహుని, సంకర్షణుల శిల్పాలతో పాటు తర్వాతకాలంలో దేవాలయాలలో వ్యక్తమైన వేణుగోపాలస్వామి, రాముని శిల్పాలను చెక్కారు. నిర్మాణమపుడు కాదు తర్వాతికాలంలో విగ్రహాలను ప్రతిష్టించినారనిపిస్తున్నది. గర్భాలయంలోని విగ్రహమూర్తులమీద కనిపించే గోపురశిలను పరిశీలిస్తే తర్వాత కాలంలో ఎపుడో పైన పేర్చినట్లు అనిపిస్తుంది.ఉత్తరభారతదేశంలో దేవఘర్ లో దశావతార దేవాలయం, దక్షిణ భారతదేశంలో నైనపాక నారసింహావతారమూర్తి దేవాలయం ఏకరూప ప్రాసాదనిర్మాణంలో పోలివున్నాయి. సర్వతోభద్ర్రదేవాలయాలు జైనులు, బౌద్ధులు నిర్మించారు. కర్ణాటకలో జైనుల సర్వతోభద్ర దేవాలయాలు కనిపిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *