Last updated on September 22, 2021
సిద్ధిపేట జిల్లాలోని మండల కేంద్రం ధూల్మిట్ట. ధూళ్మిట్టలో పదికంటే ఎక్కువ వీరగల్లులున్నాయి. అన్నీ యుద్ధవీరుల వీరగల్లులే. అందులో రెండు అడివిపందివేట వీరగల్లులు. ఒక వీరగల్లు మీద చిన్న శాసనం వుంది. అది సర్వాయి పాపన్న శాసనం అని ప్రచారంలో వుంది. అది నిజం కాదు.వరంగల్ జిల్లా వారసత్వ(పురావస్తు)శాఖ మ్యూజియంలో సేకరించి ప్రదర్శనకు పెట్టిన శిల్పాలెన్నో వున్నాయి. వాటిలో వీరగల్లులు పెద్దసంఖ్యలోనే వున్నాయి. ఆ వీరగల్లులలో ఒక వీరగల్లు మీద 3పంక్తుల చిన్నశాసనమున్నది. 13వ శతాబ్దపు తెలుగులిపిలో ‘ధూల్మిట్ట మాట్లేడి- కొడుకు దొమ్మయ వీరు-డు’ అని ఆ శాసనం రాసివుంది. శాసనాలున్న వీరగల్లులలో ఈ ధూళ్మిట్ట వీరగల్లు ఒకటి. ధూళ్ళిట్టకు మాట్లేడి కొడుకు వీరుడు దొమ్మయ స్మారకంగా వేసిన వీరగల్లు అది. వీరుడు విల్లు ధరించి వున్నాడు. అతడు కాకతి ప్రతాపరుద్రదేవుని సైన్యంలోని నవలక్షధనుర్ధారులలో ఒకడని ఒక రచయిత వ్యాఖ్యానించాడు. కాని, వీరగల్లులలో విలుగాండ్ర వీరగల్లులు చాలా పాతకాలంనాటివి కూడా లభిస్తున్నాయి. కొందరు విలుగాండ్రు విల్లమ్ములే కాదు, ఖడ్గాలు ధరించినవారు కనిపిస్తారు. రెండుచేతులతో రెండు రకాల ఆయుధాలతో పోరాడే వారు అగుపిస్తారు. అనేక ఆయుధాలతో పోరాడే సామర్థ్యం కలిగిన వీరులను ఎక్కటీలు అంటారు. వీరగల్లు మీది శాసనభాషాకాలాన్నిబట్టి విలువీరుణ్ణి కాకతీయసైన్యంలోని వాడని చెప్పవచ్చు. చేర్యాల మండలంలోని ఆకునూరు ప్రాంతంలో, కరీంనగర్ జిల్లా గొడిశాల ప్రాంతంలో కాకతీయులు యుద్ధాలు చేసినట్లు చరిత్రలో ఆధారాలున్నాయి. గొడిశాలలో కూడా మనకు 20దాకా వీరగల్లులు లభిస్తాయి. ధూళ్మిట్టలో కూడా పదికి పైగా వీరగల్లులున్నాయి.