Press "Enter" to skip to content

తొలి బౌద్ధస్తూపాల బావనూర్ కుర్రు:

తొలి బౌద్ధస్తూపాల బావనూర్ కుర్రు: బుద్ధుని కాలంలోనే తెలంగాణాకు బౌద్ధం విస్తరించింది. ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాపథంలోని అస్సక జనపదంలో ప్రవహిస్తున్న గోదావరి ఒడ్డున బాదనకుర్తి కపిటవనంలో నివసిస్తున్న బావరి, తనకు కలిగిన సంశయాలను నివృత్తి చేసుకోవడానికి తెలుసుకొని రమ్మని తన శిష్యులు 16మందిని (అజిత, తిస్సమెత్తెయ్య, పున్నకుడు, మెత్తగు, ధోతకుడు, ఉపాసి, నందుడు, హేమకుడు, తోదెయ్య, కప్ప, జాతుకన్ని, భద్రావుదుడు, ఉదయుడు, పోసాలుడు, మొఘరాజ, పింగియుడు) బుద్దుని వద్దకు పంపించాడు. వారు బుద్ధుని చేరుకుని, తమ గురువు సందేహాలకు సమాధానాలను పొందారు. బౌద్ధం స్వీకరించిన ఆ 16మందిలో తిరిగివచ్చినవాడు పింగియ. పింగియ ద్వారా బావరి కూడా బౌద్ధుడుగా మారిపోయాడు. బౌద్ధగ్రంథాలలోని ‘సుత్తనిపాతంలోని పారాయణవగ్గలో వత్తుగాథ నుంచి పింగియ మానవపుచ్చ నిథ్థిత’ వరకు (976 నుంచి 1146 గాథలు) బావరి కథ చెప్పబడ్డది. బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్ధుని స్మారకాలు నిర్మించడం మొదలైంది. ఈ నిర్మాణాలే స్తూపాలు. స్తూపం అంటే పోగు. శబ్దరత్నాకరం స్తూపం అన్న పదానికి ‘మట్టి దిబ్బ’ అని అర్థమిచ్చింది. దీని ప్రాకృతరూపం ‘థూపం’. ఈ పదం బుద్ధుని కాలంలో వాడబడలేదు. చైత్యం వ్యవహారంలో వుండేది. తనకు స్మృతి చిహ్నం చేయవచ్చునని బుద్ధుడు తన శిష్యుడు ఆనందునితో అన్నట్లు మహాపరినిర్వాణ సూత్రంలో ఉంది. బుద్ధనిర్వాణం పిదప బుద్ధుని ధాతువులమీద 8చైత్యాలను కట్టారట. అశోకుడు వాటిలో 7డింటిన తెరిపించి, అందులోని ధాతువులను చిన్న శకలాలు చేయించి, 84వేల స్తూపాలను నిర్మించాడని కథనం వుంది. నిజమేనని చరిత్రకారుల భావన.స్తూపాలు 3 రకాలు. ఉద్దేశిక స్తూపాలు, శారీరక(ధాతుగర్భ) స్తూపాలు, పారిభాజిక స్తూపాలు. ఉద్దేశిక స్తూపాలు నిరాలంకారమైనవి. ఆరాధనకు ఉద్దేశించబడినవే. శారీరక స్తూపాలు బుద్ధుని లేక అర్హతుల ధాతు అవశేషాల మీద నిర్మించబడ్డవి. పారిభాజిక స్తూపాలు బౌద్ధగురువుల వస్తువుల మీద కట్టబడినవి. బాదనకుర్తి గోదావరి నదిలో ఏర్పడిన ద్వీపంలో వున్న గ్రామం. బాదనకుర్తి నుంచి కిందికి ప్రవహించే గోదావరి రెండుపాయలుగా చీలి నడుమ మరొక ద్వీపం ఏర్పడ్డది. దీన్ని బావాపూర్ కుర్రు అని పిలుస్తారు. కుర్రు అంటేనే ప్రాచీనగ్రామం. తూర్పువైపు పెద్దగోదావరి, పడమరవైపు చిన్న గోదావరి అని పిలువబడే పాయలుగా ప్రవహిస్తుందిక్కడ గోదావరి నడుమ వున్న ద్వీపం మీద బౌద్ధస్తూపాలను సమీపగ్రామం ఎల్లాపూర్ వాసి, చరిత్ర ఉపన్యాసకుడు డి. సంతోష్ గుర్తించాడు. వీటిని చరిత్రపరిశోధకులు కుర్రా జితేంద్రబాబు, జై కిషన్, బుద్ధవనం వారు చూసారు. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలోని (నిర్మల్ నుంచి కడెం దారిలో లింగాపూర్ నుంచి) ఈ బావాపూర్ కుర్రు ద్వీపంలోవున్న బౌద్ధస్తూపాలను పరిశీలించడానికి పూనా దక్కన్ కాలేజిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఘన్వీర్, బుద్ధవనం ప్రాజెక్టు సలహామండలి సభ్యుడినైన నేను, బుద్ధవనం ఉద్యోగి వెళ్ళాం. ఈ స్తూపాలకు దేశంలోనే తొలిసారి నిర్మించినవని పేరున్నది. బుద్ధునికాలంలోనే తెలంగాణాలోనికి బౌద్ధం అడుగిడిన నేల యిది. ఇక్కడ తొలుత ఉద్దేశిక స్తూపాలు నిర్మించబడివుండాలి. వాటిమీదనే తొలి సాతవాహనరాజుల కాలంలో బౌద్ధస్తూపాల పునర్మిర్మాణం జరిగివుండాలి. మేం రెండు చిన్న స్తూపాలను, ఒక పెద్ద స్తూపాన్ని పరిశీలించాం. మరిన్ని స్తూపాలు వుండే అవకాశం వుంది. చిన్న స్తూపాలు రెండు 25 అడుగుల వ్యాసంతో వున్నాయి.ప్రదక్షిణాపథాలు 8 అడుగులు వెడల్పున్నాయి. రెండవ చిన్న స్తూపంలో వున్న ఇటుకలు ఇంగ్లీష్ ‘ఇ’ క్రమంలో పేర్చివున్నాయి. ఇటుకల సైజు పెదబంకూర్ ఇటుకలతో పోలివుంది. వివిధసైజులలో కనిపిస్తున్న ఇటుకలు వేర్వేరు కాలాలనివనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ స్తూపాలు పునరుద్ధరణ చేయబడ్డాయని చెప్పవచ్చు. పెద్దస్తూపం 3 వరుసల చతురస్ర వేదికల పైన నిర్మించబడ్డది. స్థానికంగా లభించిన రాళ్ళనే స్తూపం అంచులలో బేస్ గా వాడుకున్నారు. ఈ స్తూపం దాదాపు 16 అడుగుల ఎత్తుంది. 26 అడుగుల వ్యాసంతో వుంది. మొత్తం స్తూపం సోపానవేదికలతో కలుపుకుని 60 అడుగుల మధ్యదూరం కలిగివుంది. ఇటుకల కొలతలను, అక్కడ లభించిన కుండపెంకులను పరిశీలించినపుడు అవి తొలిసాతవాహనకాలానికి చెందినవని నాకనిపించింది. శ్రీకాంత్ గారు అవునని నిర్ధారించారు. ఠాకూర్ రాజారాం సింగ్, మలయశ్రీలు సుత్తనిపాతంలోని బావరి గాథ ద్వారా బాదనకుర్తిని కనుగొనడానికి ప్రయత్నించారు. ఠాకూర్ రాజారాం సింగ్ బాదనకుర్తిని తొలిసారి గుర్తించాడు. సుత్తనిపాతం తెలంగాణా చరిత్ర తొలివెలుగు దారుల్ని చూపించింది. కొసమెరుపు: స్తూపపరిసరాల్లో మధ్యరాతియుగానికి చెందిన మైక్రోలిథ్స్ లభించాయి. ఈ ప్రదేశం వేలాదియేండ్లుగా మానవావాసంగా వుందని చెప్పడానికి సాక్ష్యాలు దొరికినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *