Press "Enter" to skip to content

తెలంగాణా చారిత్రక పరిణామం:

Last updated on September 22, 2021


తెలంగాణా అతిపెద్దదైన భారతద్వీపకల్పంలోని భాగం. చుట్టూ కర్ణాటక, రాయసీమ, మహారాష్ట్ర పీఠభూములు విస్తరించి వున్నాయి. ఒకవైపున ఆంధ్రప్రదేశ్‌ వుంది. ఒరిస్సాలో కొంతభాగం, తమిళనాడు ప్రాంతాల చరిత్ర పూర్వ, చారిత్రక సంధియుగాల సంస్కృతుల మధ్య పోలిక వుంది. క్రీ.పూ.1000-3000 సం॥ల మధ్య మొదటి చారిత్రక నగరాలు నిర్మాణమైనట్టు విదితమౌతున్నది. తెలుగు మాట్లాడే ఆంధ్రజాతి ప్రజలు రాజ్యం చేయడం ఈ కాలంలోనే మొదలైనట్లు పురాణేతిహాసాల సాక్ష్యాల లభిస్తున్నాయి.
‘తెలంగాణా చరిత్ర బుద్ధుని సమకాలీనచరిత్ర’ అంటాడు తిరుమల రామచంద్ర. ‘తెలంగాణాలో మనిషి ప్రాగైతిహాసిక కాలంలో 3 లక్షల యేండ్ల నుంచి నివసిస్తున్నాడని తెలుస్తున్నది. చరిత్రయుగం తెలంగాణాలో బౌద్ధంతో ప్రారంభమైంది. అస్మక లేదా అస్సక జనపదంలో ప్రధానపట్టణం బోధన్‌. బోధన్‌ రాజధానినగరంగా శాతవాహనులకు పూర్వమే శుంగ, కాణ్వుకాంలోనే ప్రసిద్ధం. బావరి శిష్యులతో మొదలైన బౌద్ధం తెలంగాణా అంతటా వ్యాపించింది. బౌద్ధులలో ఏర్పడ్డ చైత్యక, అపరశైలేయ, రాజగిరీయాది శాఖల్లో రాజగిరీయులు రాచకొండవారయి వుంటారని (రాచకొండ ప్రాంతంలో బౌద్ధం ఆనవాళ్ళు కనిపించలేదు`రచయిత) లేదా యాదగిరిగుట్ట ద్వారమైన రాయగిరివారు (రాయగిరి ‘మల్లన్నగుట్ట’పై బౌద్ధస్తూపం ఆనవాళ్ళు కనిపించాయి`రచయిత) అయినా కావచ్చ’ని చీమకుర్తి శేషగిరిరావు భావన.(ఆంధ్రపత్రిక `1982).
చరిత్ర నిర్మాతలను తెలుసుకోవడానికి గతంలోనికి యాత్ర చెయ్యాలి. భారతదేశంలో అత్యున్నత నాగరికతా నిర్మాతలు ద్రవిడులని, వారే దక్షిణభారతదేశానికి వచ్చి శాశ్వతంగా వుండిపోయారని చరిత్రకారుల అభిప్రాయం.
దక్షిణభారతదేశాన్ని ‘దక్షిణాపథ’మని తొలిసారిగా పేర్కొన్నది రుగ్వేదం. ఇది ఆర్యుల ప్రపంచానికి ఆవలవున్న ప్రదేశం. బోధాయనుడు సౌరాష్ట్రతో కలిపి దక్షిణాపథాన్ని పేర్కొన్నాడు. మహాభారతంలోని నలోపాఖ్యానంలో అవంతికి, వింధ్యాపర్వతాలకు మరియు విదర్భ, కోసలకు దక్షిణదిశలో దక్షిణాపథముందని చెప్పబడింది. (కృష్ణశాస్త్రి`1983). బౌద్ధంలోని సుత్తనిపాత, వినయ పిటకాలు, పాణినిసూత్రాలు, దక్షిణాపథాన్ని ‘దాక్షిణాత్య’గా పేర్కొంటున్నాయి. పాణిని అష్టాధ్యాయిలో (క్రీ.పూ.7వ శతాబ్దం) అశ్మక, కళింగను పేర్కొన్నాడు.
అప్పటి జనపదాలు ప్రత్యేకతెగ సామూహిక ఆవాసాలు. అవి రాజకీయ పాలనాప్రాంతాలుగా మార్పు పొందడానికి చాలాకాలం పట్టింది. వ్యాసుడు(కర్ణపర్వం`మహాభారతం), టాలమీ, రాజశేఖరుడు, వాత్స్యాయనుడు (కామశాస్త్రం), యాంగ్‌`చు`వాంగ్‌, భరతుడు(నాట్యశాస్త్రం), దండి(కాదంబరి)`రచనలను బట్టి ప్రతి జనపదం దేనికది ప్రత్యేక సాంస్కృతిక లక్షణాలు కలిగి వుండేది. వారి ఆచారాలు, సంప్రదాయాలు, భాష, శైలి, రీతులు ఆ జనపదాలకే సొంతం.(యాజ్దాని).
జైనగ్రంథం ‘భగవతిసూత్రం’లోని జనపదాల జాబితాలోని పేర్లతో ఏకీభావం లేనప్పటికి, అంగౌత్తరనికాయ’ అనే బౌద్ధగ్రంథంలో పేర్కొన్న జనపదాల పేర్లు నమ్మదగినవని History of Ancient Indiaలో కె.సి.చౌదరి రాసాడు. షోడశజనపదాలుగా ‘అంగ, అవంతి, అస్మక, కాశీ, భోజ, కురు, కోసల, గాంధార, ఛేది, పాంచాల, మగధ, తుళువ, వత్స్య, వ్రజ, శూరసేన’లు పేర్కొనబడ్డాయి.‘ఆంధ్ర’ జనపదం పేరు(ఈ జాబితాలో)లేదు.
తెలంగాణాలోని పెద్దభూభాగం ‘అస్మక’ జనపదంలోనిదే. ‘ములక’లోని కొంతభాగం కలిసిపోయి ఇప్పటి తెలంగాణా అయింది. ‘అస్మక’కు అస్సక, అసక, అళక, అశ్మక’ అనే పేర్లు నామాంతరాలుగా వాడబడ్డాయి. బుద్ధుని సమకాలికుడు సుజాతుడనే పాలకుడు అస్మకను పోతలి(పోదన, బోధన్‌, బహుధాన్యపురం)రాజధానిగా పాలించాడని బౌద్ధగ్రంథాలు చెప్తున్నాయి. మహాభారతంలో పౌదన్యపురం రాజధానిగా ఏుతున్న అశ్మకరాజు తన సైన్యంతో పాండవుల పక్షాన యుద్ధంలో పాల్గొన్నట్లు చెప్పబడింది. అంటే మహాభారతకాలం(క్రీ.పూ. 100 సం॥)నాటికే అస్మక జనపదం. దానికి రాజధానిగా బోధన్‌ ఉన్నది కదా!.
విదర్భకు(వత్సగుల్మ), దక్షిణకోసలకు దక్షిణాన వున్నవి అస్సక, ములకనే జనపదాలు. సుత్తనిపాతంలో రాసినట్లు అస్సక గోదావరి ఒడ్డున నెలకొని వుంది.‘అస్సక జాతకం’ ప్రకారం కాశీరాజ్యంలో భాగంగా, పోతలి రాజధానిగా ‘అస్సకరాజు’ పాలిస్తుండేవాడు. ‘చుళ్ళ`కళింగ’జాతకంలో కళింగదేశం దంతపురం రాజధానిగా కళింగుని ఏలుబడిలో వుండేదని ఆ సమయంలో అస్సకదేశంలో పోతలి రాజధానిగా అస్సకుడు పాలిస్తుండేవాడని చెప్పబడ్డది.
కళింగరాజు శతభు, అవంతిరాజు వెస్సబు, సౌవీర పాలకుడు భరతుడు, విదేహరాజు రేణు, అంగరాజు ధాతరట్ట, కాశీరాజు ధాతరట్టకు సమకాలికుడైన బ్రహ్మదత్తుడు అస్సకను పాలించాడు.(Political History of Ancient India-1972, హెచ్‌.రాయ్‌చౌధురి)
‘ఐతరేయబ్రాహ్మణం’ పేర్కొన్న తెగల్లో ‘ఉదంత్యః’ అంటే (ఆర్యరాజ్యం) సరిహద్దుకవతలుండేవారు మరియు దస్సులు. వాళ్ళు ఆంధ్రులు, పుండ్రులు, సవరులు, పుళిందులు, మూతిబులు (సాంఖ్యాయన సరస్సూత్రలో పేర్కొన్నట్లు విశ్వామిత్రుడు తన 50మంది కొడుకులను కలువమని శపించినజాతులు).వీరంతా గంగానది కిందిలోయల్లో నర్మద, గోదావరి, కృష్ణానదుల ప్రాంతాల్లో వుండేవారు. కృష్ణా, గోదావరినదుల దిగువలోయల్లో ఆంధ్రులు ఆక్రమించుకున్నారు. వారిలోని ఒక చిన్నసమూహం ‘అంధ్‌’నేవారు విదర్భలోని బుల్దానాజిల్లాలో నివసించారు. ‘పుండ్రు’ ఉత్తరబెంగాల్‌లో, గోదావరి ఉపనది ‘శబరి’, వింధ్య నడుమ ‘సవరులు’, పుళిందులు రేవా(నర్మద)నది ప్రాంతంలో, మూతిబులు గంగానది ముఖద్వారంలో ఏర్పడ్డ ఒండ్రుదిబ్బల ద్వీపాల్లో, ఆంధ్రులతో ఉండేవారని ఐతరేయ బ్రాహ్మణం చెప్తున్నది. దస్యతెగల్లో ఆంధ్రులు ద్రవిడులై ఉంటారు. మిగతావారు బహుళతెగవారు. సిల్వెన్‌లెవీ పొరుగున జీవించిన జంట ప్రాచీనతెగలను పేర్కొంటాడు. అవి కోసల`తోసల, త్రిలింగ`కళింగలు.
‘ఆంధ్రుల’ప్రస్తావన తొలిసారి ఐతరేయబ్రాహ్మణంలోనే వస్తుంది.‘సామంత వసదిక’అనే బౌద్ధగ్రంథం ఆంధ్రులను, తమిళులను కలిపి ‘మ్లేచ్చు’లు అని సంబోధించింది. క్రీ.పూ. 5000 సం॥నాటి బౌద్ధగ్రంథాలో గోదావరిలోయలో ‘అంధకరట్ట’ వున్నట్టు చెప్పబడ్డది. ఈ ప్రాంతంలో క్రీ.పూ. 8వ శతాబ్దంలోనే ‘అస్మక’ జనపదం రాజధానిగా వుండేదని పోతలి(బోధన్‌) గురించి ప్రస్తావన ఉంది. భారతదేశంలోని షోడశజనపదాలలో ఒకటైన అస్సక(అశ్మక)జనపదం తెంగాణాలోనిదే. మిగతాపదాలకు సమకాలీనంగావున్న అస్సక క్రీ.పూ.1000-`500ల మధ్య వుండేది. చంద్రగుప్త మౌర్యుని(క్రీ.పూ.326) ఆస్థానంలోని గ్రీకురాయబారి మెగస్తనీసు తనగ్రంథం ‘ఇండికా’లో ఆంధ్రులకు 30 దుర్గాలున్నాయని, 1లక్ష కాల్బలం, 2వేల అశ్వికులు, 1000 ఏనుగులను రాజుకు అందించగల సామర్ధ్యంతో ఉన్నారని రాసాడు. ఇక్కడ ఆ రాజెవరో పేర్కొనబడలేదు.
మౌర్య చంద్రగుప్తుని కాలంలో ఆంధ్రులు 30 దుర్గాలు కలిగివున్నారని మెగస్తనీస్‌ రాతలవల్ల తెలుస్తున్నప్పటికి, ఆంధ్రులప్పటికి స్వతంత్రరాజులా లేక మౌర్యచక్రవర్తిపాలనలోవున్న తెగలా(ఆంధ్రశ్చబహవః) చెప్పడం కష్టతరం. మామునార్‌ అనే ‘సంగం’వాఙ్మయకాలానికి (క్రీ.శ. 1-3శ.ల) చెందిన తమిళకవి ‘అహనానూరు, పురనానూరు’ అనే గ్రంథాలలో మౌర్యులు ద్రవిడదేశంపై దండెత్తినపుడు మౌర్యసైన్యానికి ముందుగా ‘వడుగర్లసైన్యం’ నడిచిందిట. తమిళంలో ‘వడుగర్లు’ అంటే తమిళులకు ఉత్తరాన ఉండేవాండ్లు`‘తెలుగువారు’ అని అర్థం. దీన్నిబట్టి ఆంధ్రులు (సామంతు లైనందున) మౌర్యులకు వడగర్లసైన్యం సమకూర్చివుండాని భావించాలి.
విస్తారమైన భారతద్వీపకల్పంలో తెలంగాణా ఒక భౌగోళికభాగం. ఈ ప్రాంతప్రదేశాలలోని చరిత్ర సంధియుగ సంస్కృతుల నడుమ సమరూపత(Similarity)వుంది. ఒకప్పటి ఇనుపయుగం తావుల్లో కొన్ని మొదటి చారిత్రక పట్టణాలుగా పరిణమించాయి.
క్రీ.పూ.1000నాటికే తెలంగాణా భూభాగాన్ని ‘ఆంధ్ర’ప్రదేశంగా గుర్తించడం మొదలైనట్టు తెలుస్తున్నది. ఆంధ్రులనే మాట రామాయణ, మహాభారతేతిహాసాల్లో పేర్కొనబడింది. లభించిన ఆధారాల ప్రకారం క్రీ.పూ.500కు పూర్వమే బౌద్ధగ్రంథాలలో ‘అంధకరట్ట’ అని, పాలకుడు అస్సకుని, క్రీ.పూ.326లో మెగస్తనీసు ‘ఆంధ్ర’ నామాన్ని ప్రస్తావించారు. ‘అంధ’ అనే ప్రాకృతరూపమే సంస్కృతీకరించబడి ‘ఆంధ్ర’గా పిలువడం జరిగిందని కొందరు చరిత్రకారులు నమ్ముతున్నారు. నిజామాబాద్‌జిల్లా గోదావరి తీరప్రాంతం నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌జిల్లా వరకున్న భూభాగం ‘అంధకరట్ట’ (క్రీ.పూ.5 లేదా 4వ శతాబ్దం)అని పిువబడింది.
క్రీ.పూ.260ప్రాంతంలో వేయబడిన అశోకుని 13వశాసనంలో కళింగ విజయప్రస్తావనతోపాటు ‘‘నా రాజ్యంలో దరదులు, విషవాజులు, నాభాగులు, నాభపంక్తులు, భోజులు, యవనకాంభోజులు, పితినిగుల్యులు, పుళిందులు, ఆంధ్రులు మొదలైన ప్రజలు దేవానాంప్రియుని ధర్మశాసనాన్ని అనుసరిస్తున్నారు’’`అని వుంది. క్రీ.పూ.236 ప్రాంతంలో అశోకుని మరణానంతరం సాతవాహనులు స్వతంత్రరాజ్యాన్ని స్థాపించి వుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *