Press "Enter" to skip to content

రేబెల్లెలో మెగాలిథ్స్

బల్లెలో మెగాలిథ్స్ :పులిచింతల ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలను సర్వే చేసి ఆయా గ్రామాలలో వున్న పురాతన సమాధులను గుర్తించి, వాటిలో కొన్నింటిని తవ్వించింది పురావస్తుశాఖ. 30యేండ్ల కిందనే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నెమలిపురి, వజినెపల్లి, వెల్లటూరు, శోభనాద్రిగూడెంలలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నాగపూర్ శాఖవారు నందిని భట్టాచార్య దర్శకత్వంలో తవ్వకాలను చేపట్టారు. నెమలిపురిలో 526, వజినెపల్లిలో 360 సమాధులను లెక్కించారు. వెల్లటూరు, శోభనాద్రిగూడెంలలో ఇప్పటికి వందలోపు సమాధులు అగుపిస్తున్నాయి. అయితే కొత్తగా ఈ మండలంలోని గ్రామం రేబల్లెలో 30 మెగాలిథిక్ సమాధులను తెలంగాణా జాగృతి చరిత్రబృందం గుర్తించింది. ఈ అన్వేషణలో చరిత్రబృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, చంటి, సహాయకుడు జి.రాము, దాసరి గోపి, పాలూరి మోష పాల్గొన్నారు. ముంపుకు గురౌతున్న గ్రామాలలో పర్యటించి పురావస్తు ఆధారాలను, చారిత్రక విశేషాల గురించి మళ్ళీ రాయాలనే ఆలోచనతో పునరన్వేషణకు పూనుకున్నది మా చరిత్రబృందం. ఈ పర్యటనలో భాగంగా నెమలిపురి, వెల్లటూరు, చింత్రియాల్, వజినెపల్లి, అడ్లూరు, తమ్మారం, శోభనాద్రిగూడెంలలో పురావస్తు సమాధులను, దేవాలయాలు వంటి చారిత్రక స్మారకాలను ఫోటో డాక్యుమెంటేషన్ చేయడం జరుగుతున్నది.గతంలో నెమలిపురి, వజినెపల్లిలలో ఎక్కువగా పెట్టెసమాధులు(Cist burials with capstones and without capstones), బంతిరాళ్ళ కైరన్లు(Cairns with stone circles) కొన్ని కంతబొర్రెలతో, కొన్ని కంతబొర్రెలు(Port holes) లేకుండా వున్నాయి.రేబల్లెలోని మెగాలిథ్స్ కూడా నెమలిపురి, వజినెపల్లి సమాధులవలెనె స్వస్తిక్ ఆకారంలో పాతిన రాతిసలపల పెట్టెసమాధులున్నాయి. రెండుచోట్ల ఈ సమాధుల పక్కన 8అడుగుల ఎత్తున్న నిలువురాళ్ళు (Menhirs) నిలిపి వుండడం విశేషం. ఇట్లా మెన్హరున్న సమాధులు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. 12 రకాల పెదరాతియుగపు సమాధులలో మెన్హర్లుండడం ఒక విధం. ఇక్కడి సమాధులలో పెట్టె సమాధుల చుట్టు బంతిరాళ్ళుండడం, అవి కూడా ఒక మెట్టులెక్క పేర్చివుండడం దామరవాయి డోల్మనాయిడ్సును గుర్తు తెస్తున్నాయి. ఒక సమాధికి కంతబొర్రె వుంది. ఈ ప్రాంతమంతా రాళ్ళనేల కావడం వల్ల పెట్టెసమాధులు మొత్తం భూమిలో లేవు. సగం వరకు నేలమీదకు వుండడం వల్ల ఇవి అదనంగా డోల్మన్ల లక్షణాలను కలిగివున్నాయి.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి