తెలంగాణాలో కొత్త గధేగల్లు శాసనం:
చరికొండ గ్రామము పాత మహబూబునగరం జిల్లా, కల్వకుర్తి తాలుకా, ఆమనగల్ మండలంలో వుండేది. ఇప్పుడది రంగారెడ్డి జిల్లా, కడ్తాల మండలానికి మార్చబడ్డది. . గ్రామంలో ఉత్తరదిశలో రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి దేవాలయముంది. ఇంకా ఈగ్రామంలో గ్రామదేవతలు దుర్గమ్మ, పోచమ్మ, కోటమైసమ్మలకు గుడులు వున్నాయి. పాతకాలంనాటి మసీదు వుంది. గ్రామానికి ఉత్తరదిశలో ఖిల్లాగుట్ట వుంది. గుట్టమీద కోట ఆనవాళ్ళున్నాయి. గుమ్మటాలని ప్రజలు పిలుచుకునే కట్టడాలు 4మిగిలివున్నాయి. ఈ కోటను రేచెర్ల పద్మనాయకులు కట్టించారని చరిత్ర.
చరిగొండ ధర్మన్న చిత్రభారత కావ్యం రాసిన కవి. చరిగొండవాడే. వరంగల్ నేలిన షితాబుఖాన్ అనబడే సీతాపతి వద్ద మంత్రిగా పనిచేసిన ఎనమలూరి పెద్దనకు చిత్రభారతకవి చరిగొండ ధర్మన్న 8 ఆశ్వాసాల ప్రబంధ కావ్యం చిత్రభారతాన్ని అంకితం చేసాడు. పెద్దన ధర్మపురికి చెందినవాడు. ధర్మన్న జీవితాకాలాన్ని ఆయన రచనలతో లెక్కించి క్రీ.శ. 1480 నుంచి 1530గా నిర్ణయించారు. మరొక ప్రతిభావంతుడైన కవి చరిగొండకే చెందిన హొన్నయ్య. ఈయన 17వ శతాబ్దంలో ‘జ్యోతిష్యరత్నాకరం’ రచించాడు. ప్రస్తుతమీ గ్రంథం లాస్ ఏంజెల్స్ గ్రంథాలయంలో వుంది.
శాసనస్థలం: చరిగొండ ఖిల్లాగుట్ట బండరాయి
శాసనభాష: తెలుగు శాసనలిపి: తెలుగు శాసనపంక్తులు: 12
శాసన సందర్భం: దాన శాసనం
శాసన సమయం: శక సం. 1418 నలనామ సం.ర ఆశ్వయుజ శుద్ధ దశమినాడు అనగా క్రీ.శ. 1496 సెప్టెంబర్ 17వ తేదీ శనివారం
శాసనకాల పరిపాలకుడు: బీదర్ బహమనీసుల్తాను షాబుద్దీన్ మహమూద్ (1482-1518) పాలనలో తెలంగాణా గవర్నర్ కుతుబుల్ ముల్క్
దానగ్రహీత: బొమ్మజియ్యవ తిపజియ్యవ బసవజయ్య
శాసనపాఠం:
1. స్వస్తిశ్రీ శాక 1418 అగు నల సంవత్సర ఆశ్వజ
2. శుద్ధ 10గు నాడు ఖానె ఆజంమల్లూఖానవొదయలుంగారి
3. మలుక శరఖు మలుక మింన్నాజయినుకారు పరమావొదయలు
4. 0గారు చరికొండ్డ బొంమజియ్యవ తిపజియ్యవ బసవజయ్యగార్కి ఇ
5. చ్చిన శాసనపత్రముII హులిమఖలోనువలివేండ్రి చలిమల వె
6. స్వకాలం యెనిమిదినెల్లొని(క్మా)పొయను కట్టడిచేశి మీకు సిప్పా
7. హంజానవొదయలుంగారు మాకు గవురసముద్రవెన
8. క ఖా..పుట్టెడువడ్లపొలంయిచ్చినారు.ఆ పొలంలోన మీ
9. కువొరబూవుపొలం యిస్తిమిIIఖానవొదయలుంగా
10. రు కారు పరమాయిచ్చన కవులు క్రమాననినిమున్ను ఇస్తిమి యె
11. యింద్దుకు యవ్వరు తప్పినాంను వానిఆలి మింద గాడిది
12. …యెక్కును మంగళ మహా శ్రీశ్రీశ్రీ
శాసనం కొసన స్త్రీపైన పడుతున్న గాడిద బొమ్మ చెక్కివుంది.
శాసన సారాంశం:
బీదర్ బహమనీ సుల్తాను షాబుద్దీన్ మహమూద్ (1482-1518) పాలనలో తెలంగాణా గవర్నర్ గా కుతుబుల్ ముల్క్ వున్నపుడు రాజప్రతినిధి ఖాన్ ఆజం అలీఖాన్ మాలిక్ సరఖ్ మాలిక్ మిన్నా జైన్ పరమవొదయలుగారు చరికొండలోని బొమ్మజియ్య గారి బసవజయ్యకు వేసవికాలంతో పాటు 8నెలలు పంటసాగుచేసుకునే, పుట్టెడు వడ్లు పండే భూమిని గౌరసముద్రము వెనక యిచ్చాడు. ఇది కవులుగా యివ్వబడింది. ఇందుకు ఎవరు తప్పినా, శాసనం తప్పినవాని భార్యమీద గాడిద ఎక్కును అంటే వానిభార్య గాడిదచే భోగింపచేయబడునని శాసన శాపోక్తి చెప్పబడింది.
ఇటువంటి శాసనాలను ‘గధే(గాడిద)గల్లు’లంటారు.
గధేగల్లులు: వీరగల్లు, సతిగల్లు, వీరశైవభక్తిగల్లు, జంతువీరగల్లులు చూసాం. కొందరికి మాత్రమే తెలిసిన కొత్తది ‘గధే(గాడిద)గల్లు’.మహారాష్ట్ర (బరోడా, బీజాపూర్, తుల్జాపూర్), గోవా, గుజరాత్, బీహార్, తెలంగాణాలలో ఈ గాడిదగల్లులు కనిపిస్తున్నాయి. ఇవి ప్రధానంగా 11వ శతాబ్దం నుంచి కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇవి దానశాసనశిలలు. సాధారణంగా మూడంతస్తుల శిలాఫలకాలు. మొదటి అంతస్తులో సూర్య,చంద్రులు, కలశం, శివలింగం వుంటాయి. రెండవ అంతస్తులో శాసనం వుంటుంది. సాధారణంగా దానశాసనాలలో అంతిమంగా దానాన్ని తప్పినవారు పాపాన్ని మూటగట్టుకుంటారని హెచ్చరించే శాపోక్తుల శ్లోకాలుంటాయి.అటువంటి హెచ్చరికగా శాసనాల కింద స్త్రీతో గాడిద సంభోగదృశ్యాలు చెక్కివుండడం ‘గాడిదగల్లుల’ ప్రత్యేకత. నాటి పాలకుల ఆజ్ఞ, అధికారం, శాసనాన్ని పాటించని, విధేయత చూపనివాడి తల్లిని లేదా వాడింటిలోని స్త్రీని గాడిదతో సంభోగింపచేసే శిక్ష వేస్తారని సూచించే శిలాఫలకం ఈ ‘గధేగల్’. ఇది దారుణమైన శాసనం. Harshada Wirkud వంటి చరిత్రకారులు వీటిని (Ass‐curse steles) అన్వేషించి బయటకు తీయించి పరిశోధనలు జరిపి పుస్తకంగా తెచ్చారు. ఇంకా కొంతమంది పరిశోధనలు చేసారు,చేస్తున్నారు కూడా.
పై శాసనం తరవాత వేయబడిన మహబూబునగర్ జిల్లా శాసనాల సంపుటిలో పేజి.నం.167, శాసనం సం. 70 కోయలకొండ శాసనంలోని 57,58 పంక్తులలో శాసనాన్ని తప్పిన వారు ‘……..యిదిగాక తమ మానము గాడుదులకు యిచ్చిన….’ అని వుండడం చేత ఆ శాసనం మరొక ‘గధేగల్లు’ శాసనంగా చెప్పవచ్చు.
ఈ శాసనంలో పేర్కొనబడిన గౌరసముద్రం ప్రస్తావన మహబూబునగర్ జిల్లా శాసనాల సంపుటిలో పేజి.నం.105, శాసనం సం. 34 చరికొండశాసనం, చరికొండలో గతంలో చదివి, పరిష్కరించబడిన శాసనం రేచెర్ల పాలకులు 2వలింగమనేడు పాలనాకాలంలో క్రీ.శ. 1427 సం.లో వేయబడినది. తెలుగులిపి, సంస్కృతభాషలలో వున్నది. లింగమనేడు భార్య గౌరి తనపేర చరికొండలో ఒక చెరువును తవ్వించింది. ఆ చెరువు ఇప్పుడు ఆమె పేరుతో ‘గౌరసముద్రమ’నే పిలువబడుతున్నది.
ఈ శాసనాన్ని చదివి పరిష్కరించింది: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్తతెలంగాణా చరిత్రబృందం
ఖిల్లాకోట కొత్త శాసనం జాడచెప్పి, శాసనం డిజిటల్ ఫోటోలు తెచ్చినది ‘చరిగొండ చరిత్ర’ రచయిత యారీదా రాధాకృష్ణా రావు(చరిగొండ) గారు.