Press "Enter" to skip to content

కొత్త రాతియుగం – కొండపాక గొడ్డండ్లు

మానవవికాసంలో రాతియుగం తొలిమెట్టు. లక్షల సంవత్సరాల కాలంలో పురామానవుల జీవనంలో రాతిపనిముట్లది పెద్దపాత్ర. వేట, ఆహారసేకరణ దశలో రాతి పరికరాలు లేకుండా కాలం గడువలేదు. ప్రపంచమంతటా మానవపరిణతిలో చేతులు శ్రమకు అనుగుణంగా వాడుకునే విధానాలు వేర్వేరు. జంతువులతో పురామానవులు పోటీపడి ఆహార సంపాదనలో ముందంజ వేసారు. రాళ్ళతో రాళ్ళను కొట్టి పనిముట్లు తయారుచేసుకున్నారు. తొలినాటి రాతిపనిముట్ల కాలం పాతరాతియుగం. మలియుగం సూక్ష్మరాతి పరికరాల కాలం. ఆఖరుది కొత్తరాతియుగం. కొత్తరాతియుగం క్రీ.పూ. 3000సం.ల నుంచి క్రీ.పూ.1500 సం.లని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ణయించారు. పురామానవులు వేట, ఆహారసేకరణ దశ నుంచి సొంతంగా ఆహారాన్ని పండించుకునే వ్యవసాయం, పశుపోషణ దశకు పరిణమించిన కాలం. అయినా రాతిపనిముట్లే వారి పనిముట్లపొదిలో వుండేవి. కాని, ఆ రాతిపరికరాలు మునుపటికన్నా వాడిగలవి, చేతుల్లో ఇమిడేవి, వాడకంలో మన్నికగలవి. ఈ రాతిగొడ్డండ్లు అండాకారం, త్రికోణాకారపువి, బాదాంకాయ ఆకారపువి, గుండె ఆకారపువి, బల్లెం వంటివి, మైకోక్వియెన్లు (మధ్యపాతరాతి యుగానివి), డిస్కాయిడ్లు: చక్రాలవంటివి, కక్ష్యాకారపువి, ఆకుమొనవి వుంటాయి.
కొండపాక ఒక కళ్యాణీ చాళుక్యునాటి శాసనం, రెండు కాకతీయ శాసనాలలో పేర్కొనబడ్డది. అక్కడ కాకతీయ ధనుర్ధార సైనికులు కట్టించిన త్రికూటాలయం ప్రసిద్ధమైనది. కాని, ఇటీవల తెలంగాణా జాగృతి చరిత్రబృందం పరిశీలనలో కొండపాక గ్రామానికి దక్షిణ దిశలో చిన్నరాతిబోడు వద్ద వున్న చెలకలలో శాతవాహనుల నాటి ఇటుకలు, టెర్రకోట బొమ్మలు, దోసిళ్ళకొద్ది రంగు,రంగుల పూసలు, గాజు తయారీకి వాడిన రంగురాతి ముక్కలు, ఇనుం చిట్టేలు కొల్లలుగా దొరికాయి. అంతేకాదు శాతవాహనుల కాలానికి ముందునాటి చరిత్రపూర్వయుగంలోని కొత్తరాతియుగం రాతిపనిముట్లు ఒకేచోట లభించాయి.
కొండపాకలో దొరుకుతున్న చేతిగొడ్డండ్లలో అండాకారంవి, బల్లెం మొన వంటివి, బాదాం కాయ ఆకారం గలవి ఎక్కువ వున్నాయి. ద్విపార్శ్వసౌష్టవ, ద్విముఖ, కుంభాకార గొడ్డండ్లే ఎక్కువున్నాయి. వాటిలో కొన్ని అవశిష్ట వల్కలాలతో వున్నాయి. కొన్ని ఆఘాతాలతో, కొన్ని మెత్తటి సుత్తె దెబ్బలతో చేసినవి వున్నాయి.
టెక్నిక్కులు : చేతిగొడ్డండ్లను చేసే టెక్నిక్కులలో లెవల్లాయిస్, కొంబెవా టెక్నిక్కులు ప్రథానం.
చేతిగొడ్డండ్లలో ఏకముఖ, పార్శ్వముఖ, ద్విముఖాలు గలవి, అవశిష్ట పట్ట లేక వల్కలం గలవి,
ఆఘాతందెబ్బ కొట్టి చేసేవి. గట్టి సుత్తి దెబ్బల ముఖాలవి, అంచులు గలవి, మెత్తటి సుత్తె దెబ్బలతో చేసినవి,
గొడ్డండ్ల రూపనిర్మాణం:
టెర్మినల్ జోన్: సన్నని కొసలు, పైవైపు అండాకారంగా వుండేవి…క్లీవర్లు
ప్రోక్సిమల్ ఎండ్: వెడల్పుగాగాని, మొనదేరికాని వుండి వెనక ఉబ్బుగా వుండేవి
ఎడ్జెస్ : కుంభాకార, పుటాకార తలాలతో, కౌచిప్ప ఆకారంలో తోడబడ్డ, పండ్లవంటి అంచులున్నవి,
క్రాస్ సెక్షన్: తట్టువాలని, చదరమైన, క్షితిజ సమాంతరమైన, సమతల, త్రిభుజాకారంలో, రాంబస్, ట్రెపీజియం, పెంటగాన్, పాలిగోనల్, ద్వికుంభాకారంలో వున్నవి. కోణమాపకంతో కొలువవచ్చు.
త్రికోణ ద్విముఖాలు: బాదాంకాయ వంటివి, అండాకారం వున్నవి, త్రిభుజాకారాలున్నవి
ప్రొఫైల్: ద్విపార్శ్వ సౌష్టవంతో వున్నవి, ద్విముఖ సౌష్టవంతో వున్నవి,
ఆకృతులు, నిష్పత్తులు: వెడల్పు, లోతు, పొడవులను మాగ్జిమం లెంత్(L), మాగ్జిమం విడ్త్(m), మాగ్జిమం డెప్త్(e), అడుగునుంచి దూరం(a), వెడల్పులో 3/4వంతు పరికరం పొడుగునా,
సాగదీతల సూచిక: పొట్టి ద్విముఖాలవి, సామాన్య ద్విముఖాలవి, సాగదీసిన ద్విముఖాలవి,
అడ్డుకోత సూచిక: సమతల, మందపు ద్విముఖాలను వేరు చేస్తాయి.
వివిధ ఆకారాలలో వున్న ఈ రాతి పనిముట్లలో ఎక్కువగా చేతిగొడ్డండ్లు వున్నాయి. కొన్ని చీల్పుడు(క్లీవర్స్) రాళ్లు, చెక్కుడు రాళ్ళు(చాపర్స్) ఆ రాతిపనిముట్లలో వున్నాయి.
ఈ పనిముట్లలో 7అంగుళాల పొడవు, 4అంగుళాల చుట్టుకొలతలున్న ద్వికుంభాకార, ద్విపార్శ్వముఖ, ధీర్ఘలంబితమైన బల్లెపుటాకారపు గొడ్డండ్లు, 6 నుంచి 3.5 అంగుళాల పొడవు, 4 నుంచి 2.6 అంగుళాల చుట్టుకొలతలున్న బాదంకాయ ఆకారంలో ద్వికుంభాకారం, ద్విపార్శ్వముఖాలతో ట్రెపీజియం రూపంలో కనిపించే చేతిగొడ్డండ్లున్నాయి. మొత్తం లభించిన గొడ్డండ్లు 21. వాటిలో వాడనివి,కొత్తవి 9, వాడినవి, అరిగినవి 9, విరిగినవి 3. ఈ వివరాలతో ఈ ప్రదేశం కొత్తరాతియుగంలో పనిముట్ల కార్ఖానా అని చెప్పవచ్చు. ఇక్కడ లభించే గట్టివి, విరుగనివి అగ్నిశిలలను రాతిగొడ్డండ్ల తయారీకి వాడినారు. కొత్తరాతియుగంలో ఇక్కడ పురామానవుల ఆవాసాలు పెద్దసంఖ్యలో వుండాలి.ఈ రాతిబోడుకు తూర్పున నీటిప్రవాహం జాడలున్నాయి. సమీపంలోనే 2,3 కి.మీ.ల దూరంలోనే చిన్నగుట్టలున్నాయి. ఆహారం లభించే అడవులు, నీటివనరులు, పనిముట్లకు కావలసిన రాయి లభించే చోటనే పురాతన మానవులు ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. వేట,ఆహారసేకరణ నుంచి వ్యవసాయానికి ఎదిగిన కాలమే కొత్తరాతియుగం. ఒకప్పుడు పురామానవులు ఆవాసంగా చేసుకొన్న రాతిబోడులోని గుహ ఇపుడు గుడిగా మారిపోయింది. ఆ రాతిగోడలపై ఎరుపురంగు బొమ్మలుండేవని, సున్నం వేయడంతో మలిగిపోయాయని గ్రామస్తులు చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *