Press "Enter" to skip to content

నల్లగొండకోట చరిత్ర

Last updated on September 22, 2021

నల్లగొండకోట చరిత్రః

ఈ పట్టణం ఇంచుమించుగా 7వ శతాబ్దంలో కట్టింపబడ్డది. అంతకు ముందీ వూరుకు పేరులేదు. దక్షిణదిశలో వున్న గుట్టమీద ఒక దుర్గము మాత్రముండేదట. ఈ దుర్గాన్ని దమయంతి భర్త నలమహారాజు అనే తెలుగురాజు(?) కట్టించి తనపేరన ఈ పర్వతాన్ని నలుని పర్వతము లేదా నలునికొండ అని పేరు పెట్టెనని ఒక కైఫీయతు. నమ్మదగిందా, కాదా అన్నది తర్వాత ముచ్చట. జనంకథ ఇది. మరొక విధంగా నలుగొండ అనే పేరు వచ్చిందని చెప్పేవారున్నారు. క్రీ.శ.1179లో కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు తెలుగురాజ్యాన్ని విస్తరింపజేసాడు. ఆ కాలంలో ఉదయచోడ మహారాజు పానగల్లు పట్టణము కట్టించి రాజధానిగా చేసుకున్నాడు. అప్పటి నల్లగొండ పెద్ద, పెద్దచెట్లు తీగెలతో అల్లుకుని దట్టంగా వుండి, నల్లగొండ గుట్టతో నల్లగా అగుపించాయట. తన రాజధానికి సమీపంలో ఇంత భయంకరమైన అడివి వుండటం ఇష్టపడని ఉదయనుడు అడివిని కొట్టించి, కాల్పించి, బొగ్గును పానగల్లుకు కొనిపోయాడట. అడవి నరికిన గుట్టమీద, కింద ప్రజలను ఇండ్లు కట్టుకొమ్మని ఆజ్ఞాపించాడట.
రాజాజ్ఞతో ఒక్కరొక్కరుగా ఇక్కడికి చేరి ఇండ్లు కట్టుకున్నారట ప్రజలు. అపుడొక గ్రామమైందిక్కడ. నల్లగండిగా పిలువబడిన ప్రాంతం రాను, రాను నల్లగొండ అని పిలువబడసాగింది. ఈ కైఫీయతు కొంత నమ్మదగిందిగా వుంది. ఉదయనుడే నల్లగొండ దుర్గాన్ని కట్టివుండవచ్చు. దుర్గ నిర్మాణం తరవాతి కాలంలో దండయాత్రల భయంతో ప్రజలు దుర్గంలోపలే నివసించసాగారు. ఈ గుట్టను అందుకేనేమో కాపురాలగుట్ట అని పిలిచేవారు. క్రీ.శ. 1800ల ప్రాంతంలో మళ్ళీ గుట్టదిగి నల్లగండిలో ఇండ్లు కట్టుకొని నివాసాలుంటున్నారు.
నల్లగొండకు దక్షిణం, ఉత్తరాలలో రెండు పెద్దగుట్టలున్నవి. రెండు గుట్టలను కలుపుతూ కట్టిన ఎత్తైన మట్టకోటవుండేది. కోటకు తూర్పున కట్టబడివున్న సత్రపుటింటిలో ప్రతివారం సంతకు వచ్చే ఎడ్లబండ్లవాండ్లు వుంటుండేవారు. ఇపుడు దాని ఆనవాలు లేదు. కాని, నల్లగొండలో 1880సం.లో మొదలైన గురువారం సంత ఇప్పటికి కొనసాగుతున్నది. రెండుగుట్టల నడుమ ఖాళీప్రదేశం ఎక్కువ లేనందువల్ల పట్టణం పడమటినుంచి తూర్పుకు విస్తరించిపోయింది. ఉత్తరం గుట్టమీద ‘సయ్యద్ లతీపుల్లా ఖాదరీ’ సమాధి, దానిమీద 14వ శతాబ్దంలో బహమనీ రాజులు కట్టించిన గుంబజు(గుమ్మటాలు)లున్నాయి. లతీఫ్ సాహెబ్ పేరు మీద కొంతకాలం నల్లగొండ లతీఫాబాద్ గా పిలువబడ్డది. ప్రతి సంవత్సరం ఈ గుట్టమీద లతీఫ్ సాబ్ ఉర్సూ (స్మరణోత్సవం) జరుగుతుంది. అదే గుట్టమీద పడుమటికి మూడు శివాలయాలున్నాయి. దాంట్లో ఒక గుడిలో పూజలు జరుగుతున్నాయి(క్రీ.శ.1921లో). దక్షిణం గుట్ట మీదనే అతి బలిష్టమైన, శత్రుదుర్భేద్యమైన దుర్గం వుంది. ఇపుడక్కడ జనం నివాసముండడంలేదు కాని, పూర్వం అక్కడ ప్రజలు నివసించిన ఇండ్డ ఆనవాళ్ళు కన్నిస్తున్నాయి.

హరిశ్చంద్రుని కాలంలో ఈ ఖిల్లామీద రెండు ప్రహరీలు కట్టబడ్డాయట. మొదటి ప్రహరీకి రెండు రాజద్వారాలు, 7 కిటికీలు,15 బురుజులు, రెండవ ప్రహరీకి రెండు ద్వారాలు, 4కిటికీలు, 4బురుజులు కట్టబడ్డాయి.ఈ ప్రహరీ వెడల్పు దాదాపు 1కి. మీ.కన్న మించివుంది. 
1439ప్రాంతంలో సుల్తాన్ అల్లావుద్దీన్ షా బహమనీ గోల్కొండకు పాలకుడుగా వున్నప్పుడు జలాలుద్దీన్ కుమారుడు సుల్తాన్ అహమద్ షా కు మామయైన జలాలొద్దీన్ ఖాన్ కు నల్లగొండ జాగీరుగా వుండేది. అల్లావుద్దీన్ షా కాలికి గాయమైనందున కొన్నిరోజులు రాజభవనంలోనే వుండిపోయాడు. సుల్తాన్ మరణించాడని పుకారు ప్రచారమైంది. పుకారును నమ్మిన జలాలుద్దీన్ ఖాన్ తానే రాజు కావాలనుకొని నల్లగొండ పరిసరాలను ఆక్రమించుకొని తనకొడుకు సికందరుఖాన్ కు సైన్యమిచ్చి దుర్గము స్వాధీనపరచుకున్నాడు. తెలుగు సామంతరాజులు కూడా అతనినే రాజుగా చేయాలనుకున్నారు. 
ఈ వార్త తెలిసిన సుల్తాన్ అలావుద్దీన్ ఇదిరి, ఖాజా మహమ్మద్ కారాన్ అనే వారిని నల్లగొండ దుర్గాన్ని ముట్టడించడానికి పంపించాడు. ఆ సమయంలో సికందర్ ఖాన్ కోటలో లేడు. కొంతమంది రక్షకభటులే వున్నారు. సంగతి తెలిసిన సికందర్ ఖాన్ 2వేలమంది ఆఫ్ఘన్, రాజపుత్ర సైనికులతో దుర్గము వరకు వచ్చి, ముట్టడిని చూసి యేమిచేయలేక బీదర్ ఖిల్లాను చేరుకున్నాడు. ఖాజా మహమ్మద్ కారాన్ హితోపదేశాన్న విని జలాలుద్దీన్ ఖాన్ కొడుకుతో సహా గోల్కొండకు వెళ్ళి సుల్తాన్ ను శరణు వేడాడు. మునుపటిరీతిగనె నల్లగొండను జాగీరుగా పాలించుకోవడానికి అనుమతిని పొందాడు.

1444సం.లో అలావుద్దీన్ మరణించాడు. అతని కొడుకు హుమాయూన్ షా జాలం సుల్తాన్ గా సింహాసనం అధిష్టించాడు. మళ్ళీ ఏవో కారణాలతో జలాలుద్దీన్ ఖాన్ సుల్తాన్ కు వ్యతిరేకంగా యుద్ధసన్నాహాలు మొదలు పెట్టాడు. ఈ విరోథవైఖరికి తానే స్వయంగా సమాధానమివ్వాలనుకున్న సుల్తాన్ నల్లగొండదుర్గాన్ని చుట్టుముట్టాడు. సికందర్ ఖాన్ సమాధానం కొరకు ఎదురుచూస్తున్న సమయంలో తాను ఒక రాత్రి దొమ్మియుద్ధం చేసి సుల్తాన్ సైన్యంలో కొంతమందిన చంపివేసాడు. దీంతో సుల్తాన్ అదే ఉదయాన సికందర్ ఖాన్ కు ఒక సందేశాన్ని పంపించాడు. సంధి చేసుకున్నట్టయితే తనకు దౌలతాబాద్ ప్రాంతంలో ఒక పరగణాకు పాలకున్ని చేస్తానన్నాడు. దానికి సికందర్ ఖాన్ ‘నువ్వు అహమదుషా మనవడివి. నేను బహమనీషా మనవడిని కనుక నీలెక్కనె రాజ్యంలో అర్ధభాగానికి భాగస్తుణ్ణి. నాపాలు నాకు స్వాథీనం చెయ్యి. లేదా యుద్ధం చెయ్యి’ అని జవాబిచ్చాడు. యుద్ధ నిపుణుడైన సికందర్ ఖానుకే మొదట విజయం సంభవించినట్లుగా అనిపించింది. కాని, సుల్తాన్ సైన్యానికి మద్ధతుగా బీజాపూర్ నుండి వరంగల్ నుంచి సైన్యాలు వచ్చిచేరాయి. 500 మంది ఈటెలవారిని, 500మంది విల్లమ్ములు ధరించిన సైనికులను ఒక ఏనుగును కోటమీదికి పంపించాడు సుల్తాన్. యుద్ధంలో ఏనుగుబారిన పడి స్వయంగా పోరాడుతున్న సికిందర్ ఖాన్ మరణించాడు. అతని కొడుకు జలాల్ ఖాన్ ఖైదు చేయబడ్డాడు. నల్లగొండ దుర్గానికి ‘ఇంతెజాముల్ ముల్క్’ అధికారిగా నియమించబడ్డాడు.
1516లో బహమనీ షాహి రాజ్యం అంతరించింది. కుతుబ్షాహీ పాలన మొదలైంది. రాజ్యాన్ని బలిష్టపరుచుకోవడానికి కుతుభ్షాహీ పానగల్లు, మచిలీబందరు, రాజమండ్రి, కొండపల్లి, వేలూరు మొదలైన 70 దుర్గాలను జయించాడట. కుతుబ్షాహీ నల్లగొండకు చేరిన సమయంలో హరిశ్చంద్రుడను రాజు నల్లగొండ దుర్గాధిపతిగా వున్నాడట. ఎంత ప్రయత్నించినా దుర్గాన్ని పట్టుకోలేక పోయి, సంధికని వార్త పంపించాడట సుల్తాన్. హరిశ్చంద్రుడు కూడా సమ్మతించి విలువైన కానుకలతో తన రాయబారిని సుల్తాన్ వద్దకు పంపాడు. సుల్తాన్ మనసులో ఇంత చిన్నదుర్గాన్ని జయించలేకపోవడమన్నది అవమానకరమనే తలపు వుంది. రాయబారితో ‘దుర్గాన్ని చూడడానికి ఇష్టపడుతున్నానని ’ వర్తమానం పంపాడు. హరిశ్చంద్రుడు సరేనన్నాడు ఒక షరతుమీద. తనతో సైన్యాన్ని తేవద్దని. వల్లె అన్నాడు సుల్తాన్. కాని, మెరికలవంటి అంగరక్షకులతో దుర్గ ప్రవేశం చేస్తూనే దుర్గరక్షకులను చంపించాడు సుల్లాన్ వెనక కాపుకాస్తున్న సైన్యం వచ్చిచేరింది. సంకుల సమరం జరిగింది. హరిశ్చంద్రుడు బంధించబడ్డాడు. తర్వాత అతనిని సుల్తాన్ వేంకటగిరి సంస్థానాధిపతిగా చేసాడట. దుర్గంలోని దేవాలయం కూలగొట్టబడ్డది. మసీదు నిర్మాణమైంది. ఆ తర్వాత ఈ దుర్గాన్ని మరెవ్వరు పాలించినట్టుగా చరిత్రలో ఆధారాలు దొరకలేదు.

నల్లగొండ దినదినాభివృద్ధి చెందిన పట్టణం. జిల్లాకేంద్రమైంది. వ్యాపారకేంద్రమైంది. రాచబాటల కూడలి. 1921లో మాధ్యమిక పాఠశాల ఒకటి, రెండు బాలికా పాఠశాలలు, ఒక పంచమ పాఠశాల, ఒక మిషినరీ పాఠశాల వుండేవి. నల్లగొండలోని నీళ్ళల్లో అభ్రకం,ఇనుము కలిసివుండడం వల్ల ఈ నీరు బలవర్ధక మైంది. ఎండకాలంలో ఇక్కడి ఎండలు దుర్భరంగా వుంటాయి.

Special Thanks to Ragi Murali who explored the Nalgonda Fort and for his photography
And book Courtesy by Shiva shankar M, Guntur

ఆధారగ్రంథాలుః
నల్లగొండ చరిత్రము—శేషభట్టరు వేంకటరామానుజాచార్యులు,1921
జొగరాఫియా దక్కన్- మౌల్వీ మహమ్మద్ సుల్తాన్, 
తారీఖె నల్ గొండ – సయ్యద్ అహమదలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *