Press "Enter" to skip to content

రాతి పడకలు

Last updated on డిసెంబర్ 15, 2020

రాతి పడకలు:
అవైదికవాదులైన సన్యాసులను ఉద్దేశించిన సామాన్య పదాలు శ్రమణ, ముని, ముండక, తీర్థక మనే పేర్లు. మునిపదం కేవలం జైనులకే కాదు బౌద్ధులకు కూడా అన్వయిస్తుంది. బుద్ధుడు శాక్యముని.
బౌద్ధ శ్రమణకులు, సన్యాసులు నెలవులుగా బౌద్ధ ఆరామ, విహారాల్లో నివసించేవారు. బౌద్ధధర్మబోధనలు చేస్తూ దేశాటన చేసే బౌద్ధసన్యాసులకు ఒకేచోట నివసించడానికి వర్షాకాలంలోనే బుద్ధుడు అనుమతించాడు. అట్లా వారు సం.లో వర్షాకాలంలో నివసించే ఆవాసాలను ‘వస్సావాసాలు’ అని పిలిచారు. ఈ వస్సావాసాలు బౌద్ధవిహారాలు, ఆరామాలకు అనుబంధంగానే వున్నా, కొంచెం దూరంలో ఏకాంతావాసాలు, సమూహావాసాలుగా వుండేవి. వారు నివసించిన కొండగుహల్లో నిద్రించడానికి అనువుగా రాతి పడకలను ఎవరో దాతలు చెక్కించేవారు. నీరు వంటి సదుపాయాలు కల్పించేవారు. ఎన్నో శాసనాలలో, బౌద్ధ గ్రంథాలలో బౌద్ధజీవనాన్ని గురించి చెప్పబడ్డది.
గుజరాత్ లో కంభాలిద, జున్నార్ గుహల్లో, మహారాష్ట్రలోని అజంతా, ఎల్లోరా, భాజ, కన్హేరి, కార్లే, నాసిక్, పాండవలేని గుహల్లో, ఆంధ్రప్రదేశ్ లోని గుంటుపల్లిలో బౌద్ధ విహారాల్లో, ఆరామాల్లో బౌద్ధులు నివసించారు. వారి కొరకు రాతిపడకలు చెక్కివున్నాయి.
నేను యాత్రలు చేసినపుడు కంభాలిద, జున్నార్ లలో, మహారాష్ట్ర కార్లే, అజంతా, ఎల్లోరాలలో, క్షేత్ర పరిశోధనలో బౌద్ధస్తూపం గుర్తించిన తెలంగాణాలోని సింగరాయకొండ దగ్గర మునులగుట్టలో రాతిపడకలను చూసాను. నాతోపాటు సహయాత్రికులు, పరిశోధకులు కూడా చూసారు.
తమిళనాడులో సామనార, సిత్తనవాసల్, వేలాయుధంలలో రాతిపడకలున్న రాతిగుహలున్నాయి. వీటిని జైనులవని శాసనాల వల్ల తెలుస్తున్నది. సామనార పేరు శ్రమణ పదానికి అపభ్రంశరూపమే. శ్రమణపదం జైనులకెందుకు వాడినారు. ఒకప్పుడు సమానంగానే అందరికి వాడిన మాటలు మతాల ప్రత్యేక గుర్తింపు కోసం తర్వాత కాలంలో సంకేతపదాలుగా చేసివుంటారు.
రాతిపడకలను చూసి బౌద్ధులవో, జైనులవో చెప్పలేం. కాని, అక్కడ లభించే శాసనాలు, వస్త్వాధారాలతో మాత్రమే ఆ రాతిపడకలున్న స్థావరాలను బౌద్ధులవనో, జైనులవనో గుర్తించగలం.
ఈ నేపథ్యంలో బౌద్ధశాసనాలు, స్తూపం లభించిన మునులగుట్టలోని రాతిపడకలు బౌద్ధులవని ఘంటాపథంగా చెప్పవచ్చు.
ఊరికే వాదించేవారిని నిరూపించుకోవచ్చని సవినయంగా తెలియజేస్తున్నాం.

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి